Loading...
.

అమ్మ మనసు

అమ్మ మనసు
నువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!
తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత దైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతగ్గలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు త్రుప్తిగా వుంది నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నా క్కొంచెం బాధగా వుంది అందరూ నేపోయానని ఏడుస్తుంటే
నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని....!

"అమ్మ"కవితా సంకలనం నుండి సేకరించటం జరిగింది
'అమ్మ' మనసు గొప్పదనాన్ని ప్రేమను మనకు తెలియచేసిన శ్రీలత గారికి మా నమస్కారములు

మన కోసం మన అందరి కొసం....

భారతీయ సంస్కృతిలో కథ ఒక భాగం..
అమ్మ చేతి గోరుముధ్దలు ఎంత రుచో అమ్మ నోటి కథలు అంతే రుచి
వెన్నెల రాత్రుల్లో చుక్కల పందిరి క్రింద,నులక మంచంపై అమ్మమ్మ పక్కన కూర్చొని....పేదరాసి పెద్దమ్మ కధలు,చిట్టెలుక చమక్కులు,నక్క జిత్తులు,కుందేలు ఎత్తులు,కోమటి లోభితనం,కొరివి దెయ్యాల కబుర్లు,రాజుల జైత్రయాత్రలు,వీరుల త్యాగాలు,వింటూ ఊ... కొట్టని తెలుగు వాడు ఉండరేమో.
చల్లని చంద్రునిలా,సన్నని గాలిలా,జోలపాట పాటపాడుతూ నీతిని,నిజాయితీని,ఆదర్శాన్ని,అనుకువను,అలవోకగా అమ్మ చెప్పిన కధలు-కబుర్లూ మన మస్తిష్కంలో నిక్షిప్తమై మన వ్యక్తిత్వానికి ఒక రక్షణ కవచంలా మనల్నితీర్చిదిద్దుతున్నాయి.
అమ్మ చెప్పినా,అమ్మమ్మ చెప్పినా,తాతయ్య చెప్పినా, వారి ప్రేమ లాగానే ఆ కధలూ-కబుర్లూ మనల్ని సన్మార్గంలో నడుపుచున్నాయి. మన అమ్మమ్మలానే మన కధలు కూడ మనల్ని విడిచి వెళ్లకూడదని,మన సాంప్రదాయం,మన తెలుగు తనం అలనాటి తీపి గుర్తులు నిర్వీర్యం కాకూడదని,సదుద్దేశంతో మా అమ్మ కథలు-కబుర్లు ద్వార మరిచిపోయిన వారికి గుర్తు చేస్తూ, మన తరువాత తరాలకు అ కధలు అందించాలని ఆకాంక్షతో మీ ముందు ఉంచుతున్నాము..
మీ..
శ్రీ

మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము



మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము(కాపాడుకోవాలి)అను సదుద్దేశముతో ఈ బ్లాగును మొదలుపెట్టాము. ఈ మార్గంలొ నాకు తెలిసిన కొన్ని కధలు,తేట తెనుగు మాటలు,పాటలు,పద్యాలు,శ్లోకాలు,ఇందులో చేర్చబడ్డాయి. మరియు చదివి తెలుసుకున్న సేకరించిన ఎన్నో విషయాలను ఇందులో ఉంచటం జరిగింది. ఈ సందర్భంలో ఎవరి మనసునైనను నొప్పించిన వారికి నా హృదయ పూర్వక క్షమాపణలు. పెద్ద మనసు చేసుకొని వారు మా మార్గాన్ని సుగుమం చేస్తారు అని ఆశిస్తూ...
శ్రీ

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ఈ కంప్యూటర్ ప్రపంచములో, మన తెలుగును మరిచిపొబోతున్న ఈ రోజుల్లో మన కోసం మన తెలుగును బ్రతికించుకోవటం కోసం "తెలుగులోనే టైప్ చేద్దాం" 'అన్న'మా గురువు గారు 'మహీ గ్రాఫిక్స్' వారికి మరియూ ఇందులో ముఖ్యులైన "కంప్యూటర్ ఎరా" వారికి , మన తెలుగు భ్లాగర్లకి అందరికీ "నా" హృదయ పూర్వక నమస్కారములు
ప్రేమతొ .
శ్రీ...

అతి త్వరలో .......


అతి త్వ రలో మీ ముందుకు వస్తున్నందుకు మరలా మిమల్ని కలవ గలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా వుంది

సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్

అతను 1940లో కేరళలోని తనను తానే పోషించుకోలేని ఓ జూట్ కార్మికుడి ఇంట్లో పుట్టాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. హాస్పిటల్ భిల్లు 600 రుపాయలు చెల్లించకపోతే తండ్రి శవాన్ని తీసుకెళ్ళకూడదని డాక్టర్లు చెప్పడంతో తండ్రి శవాన్ని అలాగే వదిలేయాల్సి వచ్చిన నిర్బాగ్యుడతడు.
అలాంటి చీకటి చిన్నతనంలో అతను ఆ పనులు ఈ పనులు చేస్తూ కాలం గడిపాడు మద్రాసు ఆకాశవాణిలో పాటలు,సంగీత పోటీలలో పాల్గొన్నాడు.పాడాలన్న పిచ్చి ఉన్న ఆ బాలుడి వాయిస్ బాగుండలేదని న్యాయనిర్ణేతలు బహుమతి ఇవ్వలేదు.ఆడిషన్ టెస్టలోనూ ఫెయిలయ్యాడు.
"అతను కుంగిపోయాడు - కాని తాత్కాలికంగానే!బాధపడ్డాడు కాని కొంచెం సేపే!...
ఆలోచించాడు...శ్రమించాడు...తపస్సు చేశాడు పాటలు పాడుతూనే ఉన్నాడు" ..అందుకే "జేసుదాసు" అయ్యాడు.
మరి మరొక మహానుభావుడు విషయం చూద్దాం
"వెలివాడలా ఉంటుంది నిజామాబాద్ జిల్లాలోని మా నాళేశ్వర గ్రామం.అక్కడ వున్న జంగాల కుటుంబం మాదొక్కటే. శవం ముందు శంఖం ఊదడం, ఉదయం పూట భిక్షాటన చేసి బతకటం నాకు చిన్నప్పుడు తప్పలేదు.నా బాల్యం నిలువెత్తు విషాదపటం. యాచక కులవృత్తి వంశంలో జన్మించింది నా దేహం.
చిన్నప్పుడు అమ్మ ఉండగానే నాన్న మరోపెళ్ళి చేసుకోవడం,అమ్మను నాన్న చిత్రహింసలు పెట్టడం,పుట్టిన 30వరోజునే మా చెల్లెలు కన్నుమూయటం,చెరువు కట్ట పక్కనే ఉన్న మా చెల్లిలి సమాధి ధగ్గర నేను ఏడవడం ఇదంతా కన్నీళ్ల ప్రపంచం మా నాన్న నన్ను ఉదయంపూట భిక్షాటనకు పంపేవాడు."మా ఊళ్లో ఎవరు చనిపోయినా శవం ముందు శంఖం ఊదడానికి మా నాన్న నన్నే పంపేవాడు" శవం చుట్టూ చేరి,హొరెత్తి ఏడ్చేవాళ్లను చూసి నాకూ దుఃఖం వచ్చేది.అనేక రాత్రుళ్లు నిద్రలేనివే....
ఇంతటి విషాద బాల్యపు భారాన్ని మోసి..అలా అలా ఆ వ్యక్తి అనంతరం ఎంఏ చేసి ఓ లెక్చరర్ గా ,ప్రముఖ కవిగా ఎదిగారు. అతని పేరు "నాళేశ్వరం శంకరం". అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో సహా వివిధ అవార్డులు పొందిన మహనీయుడు.
ఇలా ఎందరో మహానుబావులు వారి యొక్క అమూల్యమైన విషయాలను మనకు తెలియచేసిన వ్యక్తి "శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర "గారు." సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్" అనే పుస్తకంలొ వారు వివరించారు సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని,ఒడిదుడుకులను ఎదుర్కోగల పట్టుదలను మనకు తెలియకుండా మనలో నింపే అమూల్యమైన పుస్తకం ఈ "సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్"

శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు మీకివే మా హృధయ పూర్వక ధన్యవాదాలు

సొర చెట్టు .. చింత చెట్టు , చివరికి మన సోమయ్య

మన సోమరిపోతు సోమయ్య చింత చెట్టు కింద పడుకొని ప్రక్కింటి మీదికి పాకిన సొరపాదు వంక చూస్తున్నాడు, సొర విరగ్గాసి ఉంది. "తస్సాదియ్య.! నిటారుగా నిలబడను కూడా చేతగాని మొక్కకు కడివెడంత కాయలా..? ఉక్కుముక్కలా పెరిగే చింత చెట్లకు చిటికెడంత కాయలా..?ఇదేం న్యాయమయ్యా దేముడా..? నీకున్నంత శక్తి నాకే ఉంటేనా చింతలకు కొండంత కాయలు, సొరలకు చీమ తలకాయలూ కాయించే వాణ్ణి... నువు చేసేపన్లు కొన్నిసార్లు బొత్తిగా అన్యాయంగా ఉంటాయయ్యా..!" అనుకున్నాడు.
ఇంతలోనే ఓ చింతకాయ రాలి సోమయ్య ముక్కు మీద పడింది.సోమయ్య ఉలిక్కిపడ్డాడు, చింతకాయను చేతుల్లోకి తీసుకున్నాడు.క్షణం క్రితం తను అనుకున్న మాటలు గుర్తొచ్చాయి.గుండె గుభేలు మంది, "అమ్మో ఇంతకు ముందు నేననుకున్నట్టు ఈ చింతకాయ సొరకాయంత ఉండుంటే ఇప్పుడు నా పనేమయ్యేది.." బుద్ది లేనోణ్ణి, దేవుణ్ణి అనరాని మాటలన్నాను అని పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు చేసే ప్రతి పనికి మన ఊహలకందని పరమార్దం ఉంటుంది.దైవసంకల్పాన్ని అంచనా వెయ్యడం మానవుల వల్ల అయ్యేపని కాదు అనుకుంట్టూ దేవుడకి దణ్ణం పెట్టుకొని పని వెతుకుంట్టూ బయలుదేరాడు... దేవుడు నవ్వుకున్నాడు

"ఏ పని ఎందుకు చేస్తాడో దేవుడికి తెలుసు దేవుణ్ణి ప్రశ్నించడం మనిషి పని కాదు,
దేవుడిచ్చింది పుచ్చుకుని ధన్యవాదాలు తెలుపుదాం ఆయన మాటప్రకారం, ఆయన బాట వెంట నడుద్దాం..."

పిట్ట లేని ఊరు రెక్కవిప్పదు.....

నెమలి కోన ఒక పల్లెటూరు. ఒకప్పుడది చెట్టుచేమలతో Free Image Hosting by FreeImageHosting.netపశుపక్ష్యాదులతో కళకళలాడుతూండేది . కానీ .. ఈ వేళ ఆ ఊళ్లో ఒక్క పిట్ట కూడా కనిపించదు. కోడి కూయదు, కిలకిలరావాలతో పొద్దు పొడవదు. అసలేం జరిగింది..?
ఆ ఊరిప్రక్క ఒక అడవి ఉంది అందులో రకరకాల పూలు పళ్లూ గల వృక్షాలు ఉండేవి. ఆ పళ్లూ,దుంపలూ తింటూ ప్రజలు సుఖంగా కాలం గడిపేవారు. ఒకసారి పట్నం నుంచి కొందరు వక్షివ్యాపారులు అక్కడికొచ్చారు.ఆ పరిసరాల్లో ఉన్న పక్షులు చాలా అరుదుగా దొరికే అందమైన పక్షులని పసిగట్టారు. ఆ పక్షుల్ని పట్టి తెచ్చిన వాళ్ళకి ఎక్కువ మొత్తం సొమ్ము ముట్టజెప్పారు.ఇలాంటి పక్షుల్ని ఎన్నితెచ్చినా కొంటామని చెప్పారు.
దీనితో అమాయకులైన ప్రజలు పక్షుల వెంటపడ్డారు. వలలుపన్నారు, గూళ్లు పడద్రోశారు, గుడ్లు తెచ్చి పొదగేశారు ఇలా పక్షివేట ఓ సంవత్సరంపాటు సాగింది.
ఓరోజు తెల్లవారింది ప్రకృతి మూగవోయింది. నెమలికోన చుట్టూ పదిక్రోసుల మేరకు పక్షిజాడ కనబడలేదు.పక్షులు లేక పోవడంతో పురుగుల బెడద పెరిగింది.చెట్ల ఆకులు,పూలు పళ్లూ పుచ్చి రాలిపోయాయి.అడవి ఎడారిగా మారిపోయింది.పిల్లాపాపా ఆకలితో నకనకలాడింది.ఊరు వొట్టిపోయింది.
ప్రజలు భయపడ్డారు, పశ్చాత్తాప పడ్డారు,పక్షులు మళ్లీ తిరిగి రావాలని ప్రార్ధనలు చేశారు, కానీ లాభం లేదు, ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ ఓ చోట చేరి ఏం చేద్దామా అని మంతనాలు జరుపుతున్నారు.
ఇంతలో ఓ చిన్నకుర్రాడు చిన్నారి పంజరం పట్టుకుని జనం మధ్యకొచ్చాడు.అందరూ అతడి వంకా ఆ పంజరం వంకా చూశారు.పంజరంలో ఒక పక్షి జంట.తాము డబ్బుకు ఆశపడి వేటాడి అమ్మిన మేలురకం పక్షుల జంట, ".....మా నాన్న చూడకుండా వీటిని తీసుకున్నాను. నాకు నేనే పెంచుతున్నాను...." అన్నాడు కుర్రాడు.
ప్రజల ముఖాల్లో ఆశారేఖలు ......"వీటిని పెంచండి . పక్షులు తిరిగొస్తాయ్..." అని ఓ ముసాలయన చెప్పాడు
తప్పెట్లు మోగాయి.ప్రజలు ఆనందంతో చిందులాడారు ఆ చిన్న పంజరాన్ని ఊరిమధ్య చెట్టుకు వ్రేలాడుదీశారు.ఆ పక్షి జంటను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.రోజుకోసారి ఊరంతా పంజరం చుట్టూ చేరి ప్రార్ధనలు చేసేవారు,పరవశించి పాటు పాడేవారు,ఆటలాడేవారు . పెంటిపక్షి ఒకేఒక గుడ్డు పెట్టింది, దాని మీదే పొదగడం మొదలుపట్టింది.
ఆ రోజు సాయంత్రం ఊరంతా పంజరం చుట్టూచేరింది. పొదుగుతోన్న పక్షివంకే కన్నార్పకుండా చూస్తోంది. టక.... టక...... శబ్దం.... గుల్ల పగిలింది... పక్షి పిల్ల రెక్క విప్పింది.....కువ కువ లాడింది... ఊరు మనసు విప్పారింది. ఆ ఆనందం నుంచి తేరుకునే లోపే ఆకాశంలో తెరలు తెరలుగా కదలిక.....
తలెత్తి చూశారు ఆశ్చర్యం.............పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి చెట్టుమీద వాలాయి, పంజరం చుట్టూ చేరాయి పంజరం తలుపు తెరుచుకుంది పక్షులన్నీ కలిసి ఆనందంగా ఎగిరిపోయాయి, ఊరు ఉత్సాహంతో ఉరకలేసంది,పరుగులు తీసారు , మైమరిచి నాట్యం చేసారు ....మళ్లీ అడవి చిగురించింది.పక్షుల కిలకిల రావాలతో,ఫలవృక్షాలతో కళకళలాడింది. ఆనాటినుంచి ఈనాటి దాకా ఆ ఊళ్లో కాకికి కూడా అపకారం జరగదు, పిచ్చుకకు కూడా అక్కడి ప్రజలు బ్రహ్మరధం పడతారు..
"పిట్టలేని ఊరు రెక్కవిప్పదు...
ప్రకృతిపై తెగబడితే బతుకుపండదు............."

తిప్పన్న గాడిద......


తిప్పన్నకు చాకిరేవే ప్రపంచం . ఊరందరి బట్టలూ ఉతికి గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు . తిప్పన్న కొక గాడిదుంది దాని పేరు తిమ్మన్న. తిప్పన్న సంసారం పెరిగేకొద్దీ తిమ్మన్న బరువూ పెరుగుతూ వచ్చింది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే తిప్పన్న సంసారం బరువు తిమ్మన్న వీపుమీదుగా వెళ్లమారుతోంది
ఒకరోజు తిప్పన్న బండెడు బట్టలుతికి అరేశి పొద్దువాలే వేళకి బట్టలన్నీ మూటలుకట్టి తిమ్మన్న మీద పేర్చాడు. ఎంతగాడిదైనా ఎన్నిమూటలని మోస్తుంది..? కానీ తిమ్మన్న బాధ తిప్పన్న కేమెరుక..? మూట మీద మూట రెండే గాడిదల బరువు ఒక్క గాడిదమీదే వేసి తను చిన్నమూట మాత్రం భుజాన వేసుకుని చేతులు ఊపుకుంటూ “చల్ చల్” అంటూ ముందడగు వేస్తాడు పాపం తిమ్మన్న మూలుగుతూ ముక్కుతూ ముందడుగు వేస్తుంది.

కొంతదూరం పోయేసరికి భార్య అన్నమాట గుర్తొచ్చింది. “పోయిలోకి బొత్తిగా పుల్లలేవు. రోజూ ఏటికెళ్తావేగాని ఏనాడన్నా నాలుగు ఎండుకట్టెలు తెచ్చావా..? అని గొడవ వేసుకోసాగింది ఆ విషయం గుర్తువచ్చిన వెంటనే తిప్పన్న అటూ ఇటూ చూశాడు రోడ్డుపక్క ఎండి పోయిన చెట్టొకటి కనిపించింది.భుజానున్నమూటని తిమ్మన్న మీదికి విసిరి గబగబా వెళ్లి ఎండిన నాలుగు కొమ్మలు విరుచుకొచ్చి తిమ్మన్న మీద వేశాడు . తిమ్మన్న మూలిగింది “ఎండిన కొమ్మలేగా ఏమంత బరువులే పద” అన్నాడు. మరి నాలుగడుగులు వేసేసరికి ఆఖరబ్బాయి మాట గుర్తొచ్చింది. వాడికి తాటి పళ్ళంటే మహా ఇష్టం కదా అనుకుంటూ అటూ ఇటూ చూశాడు తాటిచెట్ల క్రింద పండిరాలిన నాలుగైదు తాటిపళ్ళు కనిపించాయి వాటిని కూడా మూటల్లో కుక్కాడు. తిమ్మన్న మళ్లీ మూలిగింది “తవ్వెడు తౌడు తింటావే, నాలుగు తాటికాయలు మొయ్యలేవూ..?” అని అదిలించాడు. పదడుగులు వేసే సరికి గట్టుమీద నవనవలాడుతూ పచ్చగడ్డి కనిపించింది. గడ్డి పరకలు చూడగానే మేకపిల్ల గుర్తొచ్చింది. గబగబా నాలుగు గుప్పెళ్లు పెరికి పిడికెంత మోపుకట్టి .. “ ....... ఈ గడ్డిపరకలు కూడా బరువేనని మూల్గితే ఇక నీ పని అంతే........” అంటూ గడ్డిపరకల్ని కూడా తిమ్మన్న మిద వేశాడు. అప్పటికే అలసిపోయిన తిమ్మన్న పిడుగుపడ్డట్టు నేలకూలింది..
లబొదిబోమన్న తిప్పన్న తను చేశిన తప్పుకు బాధ పడుతూ బండెడు బరువుకు కుంగని గాడిద గుప్పెడు గడ్డి కింద ఎందుకు పడిందోనని ఆలోచిస్తూ ఆ బరువును మొత్తాన్ని ఎలా తీసుకెల్లాలలో అర్ధంకాక తలుపట్టుకూర్చున్నాడు.

దురాశ , ఆశబోతు....

" అదిగో కుందేలు, పట్టుకో , పట్టుకో..." అనటమే ఆలస్యము వేటకుక్క దౌడందుకుంది. మెరుపు వేగంతో దూసుకుపోతోంది. కాళ్లకిందున్న రాళ్లను, ముళ్లనూ లెక్క చేయటం లేదు. పొదల్లో దూరుతోంది,పిల్ల కాలువల మీంచి గెంతుతోంది,కొండరాళ్ల మీదికెక్కి అమాంతంగా గుంతల్లోకి దూకుతోంది....కుందేలును వెంటాడుతూనే ఉంది... వెంటాడి,వేటాడి చిట్టచివరకు కుందేలును పట్టుకుంది.పట్టుకుని విజయగర్వంతో వెనుదిరిగింది.ప్రపంచమంతా తనకి జేజేలు పలుకుతూన్నట్టు తోకాడిస్తూ ఉరుకులు పరుగుల మీద వేటగాడి దగ్గరికి వచ్చింది.
వేటగాడు చేయిచాచి వేటకుక్క నోట్లో ఉన్న కుందేలు చెవులు వొడిసి పట్టుకొని " వదిలేయి చల్! హుట్ హుట్ " . కుందేలును వదిలేసిన వేటకుక్క తోకముడిచింది. కుందేలును బుట్టలో వేసుకున్న వేటగాడు కులాసాగా వెళ్లిపోయాడు వేటకుక్క బానిసలా ఈసురోమంటూ వెనుక వెళ్లంది.
ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక తాత తన మనవడితో ఇలా అన్నాడు..? ఆ వేటగాడెవరో తెలుసా..? అని తెలీదు అన్నట్టు తలవూపాడు మనవడు. తాత మరలా చెప్పటం మెదలు పేట్టాడు వేటగాడు పేరు దురాశ, వేటకుక్క పేరు ఆశబోతు. దురాశకు లొంగి ఆశబోతు అడ్డమైన పనులూ చేస్తుంది.అందరినీ మోసం చేస్తుంది డబ్బు కూడబెడుతుంది. కాని చిట్టచివరికి ఏమవుతుంది..? హటాత్తుగా మృత్యువు తలుపు తడుతుంది. "పట్టుకో, పట్టుకో" మని దురాశ తరిమితే నానా తంటాలు పడ్డవాడు, మృత్యువొచ్చి "వదిలేయ్, పో" అనగానే వొట్టి చేతుల్తో మొలమీద నూలుపోగు కూడా లేకుండా మట్టిలో కలిసిపోతాడు. ఆశబోతుకు బతుకు లేదురా నాన్నా, తెలుసుకో..తాత చెప్పుకుండూ పోతున్నాడు మనవడు తాత వంక కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు మీరు ఈ కధ చదివినట్టు..

నేను కరెక్ట్ , నువ్వు రైట్ ....


ఇద్దరు మద్య అబిప్రాయబేదాలు సహజం అదే భార్యాభర్తలు అయితే మరీను కీచులాటలు,తగాదాలు,ఎడమోఖాలు పెడమోఖాలు ఇవ్వన్నీ మామూలే. అయ్య వారి ఆచార వ్యవహారాలు,ఆలోచనలు అమ్మ గారికి నచ్చవు, అమ్మ గారు పెరిగిన వాతావరణం,అక్కడి మనుషులు,మనస్తత్వాలు వేరు అవేమో అయ్యవారికి విచిత్రంగా వుంటాయి.
ఇక ఎలానో కాపురం మొదలుపెడతారు మొదట్లో తప్పక మరి కొంతకాలం ఒప్పక కొన్ని ఎడ్జెస్ట్ అవుతారు. మరి ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవటానికి కొంత సమయం అయితే కావాలి కదా..?ఇక కొంతవరకు ఎవరోఒకరు రాజీపడవలసిన అవసరం తప్పక ఏర్పడుతుంది.
అదే మన స్నేహితులుతో వస్తే వాడిని కొంత కాలం వదులుకుంటాం,బంధువులతొ అయితే దూరంగా వుండిపోతాం,పక్కింటివారితో మౌనంగా వుండిపోతాం చిట్ట చివరకు కన్నబిడ్డలతో అయినా సరే విడివిడిగా వుండి జీవిస్తాం. కానీ భార్యాభర్తలు...? జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా జీవించవలసిన వారు వీరిద్దరు మాత్రమే కలిసి మెలసి వుండాలి ఇద్దరం ఒకటై పోవాలి అనుకునేది,వుండేది వీరిద్దరు మాత్రమే.
మంచైనా,చెడైనా ఇంటి విషయాలైనా,బయటి విషయాలైనా,పిచ్చాపాటి మాట్లాడుకునేది కేవలం వీరిద్దరు మాత్రమే . ఎంత
చెప్పుకున్నా,మరెంత మాట్లాడుకున్నా వారికి ఇంకా చాలా మిగిలే వుంటాయి తిట్టుకున్నా,కొట్టుకున్నా మళ్ళీ ఏకమైపోయే బంధం వారిది. ఏ దాపరికాలూ, అరమికలూ లేని అనుబంధం వారిది. ప్రేమైక జీవులు వారు ప్రేమ కోసం జీవించే ప్రేమ పక్షులు వారు. మన జీవితభాగస్వామిని నిర్లక్ష్యం చేయడం అనేది మనకి మనమే విదించుకునే వింత శిక్ష.

నమ్మినవాడికి నాలుగు కాళ్లు..


నేను నడిచి వెళ్తున్నాను నేను మాత్రమే నాతో నా నీడ ఒకరికి ఒకరం తోడుగా మమేకమై వెళ్తున్నాము.కొంత దూరం వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను నా రెండు పాద ముద్రలతో పాటు మరో రెండు ఉన్నాయి . ఆశ్చర్యం ఈ రెండు ఎక్కడివి ..? ఎవరివి.? మరికొంత కంగారు ఇంకొంత భయం . నా నీడను అడిగాను నవ్వింది చాలా విచిత్రంగా ఎప్పుడూ చూడని విదంగా చూసి నవ్వింది.శిగ్గుతో తల దించుకున్నాను ఆలోచిస్తున్నాను నడుస్తున్నాను .నడుస్తూ ఆలోచిస్తూ భయంతో నడుస్తున్నాను.
ఇంతలో ఒక అశరీరవాణి ఇలా పలికింది "ఆ పాదముద్రలు నావే నీ వెంట వుండి నిన్ను కాపాడుకుంట్టున్నాను నేను. నేను, నేను నీవు నమ్ముకున్న దేవుడ్ని."
ఆశ్చర్యం,ఆనందం మోకరిల్లాను ఏడ్చాను.సంతోషంగా నా జీవిత ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న జీవితసత్యం నాపట్ల కూడా కర్కసత్వం చూపింది అది నిజమైంది.నాకు కూడా కష్టాలు మొదలయ్యాయి,నా ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి,భరించలేని బాధ జీవితంలో మొదటి సారిగా ఓటమి ని ఓటమి అంచుల్ని చూస్తున్నాను.అప్పుడు గుర్తుకువచ్చాడు అప్పుడు మాత్రమే గుర్తుకువచ్చే నా దేవుడు గుర్తుకువచ్చాడు.కొండంత దైర్యంతో వెనక్కి తిరిగి చూసుకున్నాను రెండే వున్నాయి నాలుగు కదా..? అదేమిటి? నా నీడను అడిగాను నవ్వింది మరలా చాలా విచిత్రంగా ఎప్పుడూ చూడని విదంగా చూసి నవ్వింది.
దేవుణ్ని అడిగాను నేను సంతోషంగా వున్నంతకాలం నాతోనే వున్నావు ,నా బాధల్లో మాత్రం తప్పించుకున్నావు అని ఆక్రోశించాను మోసగించాడని నిందించాను.
పిచ్చినాయనా! నన్నే ఏవరో పిలిస్తున్నారు అవును నేను విన్న గొంతే నా దేవుడి గొంతు నాతో మట్లాడుతోంది, స్వామీ వెన్నకి తిరిగి చూశాను రెండే వున్నాయి మరి స్వామి..?
"పిచ్చినాయనా నీ కష్టాలు చూశే నీ బాధలు చూశి నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నాను రా!నీవి నేలమీద లేవు నాయనా ఆ రెండూ నావి."
ఇంత దయామయుడైన నా దేవుడ్ని ఎంత తప్పుగా అర్ధం చూసుకున్నాను , పశ్చాత్తాపంతో కుమిలిపోయాను భోరున ఏడిచాను క్షమించు దేవా !నీ లీలల్ని నేను తెలుసుకోలేక పోయాను అని సాష్టాంగపడ్డాను...శ్రీ

అమ్మ కోసం

అమ్మ..!
అమ్మ..! తొమ్మిది నెలలు మోసి మనల్ని కంటుంది, ఆ తొమ్మిది నెలలు నిండే వరకూ గర్భంలో వుండే మనల్ని మోస్తూనే వుంటుంది. నెత్తిన ఉన్న బరువా ఎమన్నా ? కావాలంటే దించుకోవటానికి కానీ ఇది అలా కాదే 24గంటలూ మోయవలసిందే ఆ తరువాత ప్రసవవేదన ఎంత నొప్పి ఎంత వేదన ఆ మహాతల్లిది మన కోసం మన జన్మ కోసం ఆ తల్లి పడని పాట్లు లేవు చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా వేసి అండగా మనకు జన్మనిస్తుంది. అమ్మకు అది పునర్జన్మే. ఈ తొమ్మిది నెలలూ ఆమె ఎన్నో నియమాలు, మరెన్నో పత్యాలు (అన్నీ మనకోసమె) ఆ తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి మనకందిస్తుంది. మనం మంచిగా పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఆమె పడని పాట్లు లేవు తన నిద్రను మర్చిపోతుంది, మన ముడ్డి కడుగుతుంది,వేయిదేవుళ్ళకు మ్రొక్కుతుంది ఆ పిచ్చితల్లి. మన కోసం మన మీద ఉన్న అవ్యాజమయిన ప్రేమ కోసం. మనం “ఊ”.. కొడితే ఉగ్గుగిన్నెలు,అడుగు లేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు, పలకటం వస్తే పంచదార చిలుకలు పంచి పెట్టి పండుగ చేస్తుంది , మొదటి గురువుగా మాటలు నేర్పుతుంది , పాటలు పాడి నిద్రబుచ్చుతుంది. అన్నింటికీ మించి నీ తండ్రి ఫలానా అని మనకు చూపుతుంది . మనం పుట్టిన క్షణం నుండి తల్లి ఎవరో ఆమె స్పర్శ ఏమిటో మనకు తెలుసు కాని తండ్రి......? తల్లి చెబితేనే తెలుస్తుంది..
తల్లికి తన సంతానం పేగులో పేగు, రక్తంలో రక్తం అటువంటి తల్లి ప్రతి వ్యక్తికీ పూజనీయురాలు, వందనీయురాలు అందుకే “నూరుగురు సూర్యుల కంటే ఒక ఆచార్యుడు గొప్ప, నూరుగురు ఆచార్యులకంటే తండ్రి గొప్ప, నూరుగు తండ్రుల కంటే తల్లి గొప్ప” ఈ విషయం సాక్షాత్తు మనుస్మృతిలో చెప్పబడినది. తల్లి , తండ్రి , గురువు ఈ ముగ్గురూ జంగమ దేవతలు అంటే మన కళ్ల ముందు నడిచే దేవుళ్లు అని అర్దం.
“60 యేండ్లు దాటిన వృద్ధుడైనా తల్లి బ్రతికి ఉన్న వాడయితే బాలుడే , 5 యేండ్ల బాలుడైనా తల్లి లేకపోతే వృద్దుడే”ఇది స్కాంద పురాణంలో ప్రస్పుటంగా చెప్పబడినది..
నాకీ జన్మను ప్రసాదించిన నా తల్లికి అంకితమిస్తూ............శ్రీ

కాకి - పిచ్చుక కహాని

అనగా అనగా ఒక చిట్టడవి . ఆ అడవిలో ఒక పిచ్చుక దానికి తోడుగా ఒక కాకి ఉన్నాయి. పిచ్చుకది పిడకల యిల్లు. కాకిది కట్టెల ఇల్లు. రెండూ సుఖంగా ఉండేవి.
ఒకసారి పిచ్చుక కాకి దగ్గరకు వెళ్ళి “కాకి బావా కాకిబావా!” అని పిలిచింది కాకి “ఆ ఏమిటి అంటూ బయటికి వచ్చింది.
ఆ ఏమీ లేదు అందరూ చేలు వేసుకుంటున్నారు కదా మనమూ వేసుకుందామా..? అని అంది పిచ్చుక ఆలోచించిన కాకి ఆ వేసుకుందాము అంది.
కాకి మొక్కజొన్న చేను వేసింది, పిచ్చుక సెనగ చేను వేసింది .సోమరిపోతు అయిన కాకి సరిగ్గా కష్టపడేది కాదు అయినా పిచ్చక కష్టంతో రెండు చేలూ ఏపుగా పెరిగాయి ఇంతలో ఉన్నట్టు వుండి ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది కాకి కట్టెల యిల్లు ఎగిరిపోయింది . మొగ్గజొన్న పొడుగుగా ఉండటంవల్ల గాలికి వంగిపోయి పాడైపొయింది.
పిచ్చుకదేమో పిడకల గూడు కదా గాలికి చెక్కు చెదరలేదు. సెనగ పంట పొట్టిగా ఉంటుంది గదా. వానకు పాడవలేదు.
పిచ్చుక ఇల్లు, చేను చూచిన కాకికి కన్ను కుట్టింది ఎట్లాగయినా ఆ రెంటినీ కాజేయాలనుకుంది మరి మన పిచ్చుకేమో అమాయకపుది కదా కాకి పోట్లాటకు సై అంది పిచ్చుక తుర్రుమంది కాకి పెద్దదవటం వల్ల పిచ్చుకని కొట్టి పిచ్చుక ఇల్లూ, చేనూ ఆక్రమించుకుంది . పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ వెళ్ళుతున్నది దారిలో దానికొక పాముపుట్ట కనిపించింది కాకిచేత ఇన్ని దెబ్బలు తిన్నాను ఇక బ్రతికేకంటే పాము చేత కరిపించుకొని చచ్చి పోవటం మంచిది అనుకొంది మన బంగారు పిచ్చుక.
ఏడుస్తూ పుట్టదగ్గరకు వెళ్ళి రంధ్రంలో వేలు పెట్టింది ఎంత సేపు అలా ఉంచినా పాము కరవలేదు , ఎందుకు కరవలేదబ్బా అనుకుంటూ వేలు తీసి చూసింది అరే మన బంగారు పిచ్చుక వేలికి బంగారు ఉంగరం వచ్చింది దానిని చూసి పిచ్చుక ఎగిరి గంతులేసంది మరలా కొంచ్చంసేపటికి అయ్యో ఇది నాది కాదు కదా! పాముది దానికే ఇచ్చేదాము అనుకొని ఇంకోసారి పాము పుట్టలో వేలు పెట్టింది కొంచెం సేపటికి మళ్ళీ తీసింది మళ్ళీ మరో వేలికి ఇంకో బంగారు ఉంగరం వచ్చింది.
ఆ రెండు ఉంగరాలు తీసుకుని పాముకు నమస్కారం తెలియచేసి వేరే ఇల్లు కట్టుకుందామని సంతోషంగా వుళుతున్నది . మార్గమద్య దారిలో కాకి పిచ్చుకని చూసి దాని దగ్గర ఉన్న బంగారు ఉంగరాలు చూచింది. కాకి ఎంతో ఆశ్చర్యపోయింది దుర్బుద్దితో వాటిని కాజేయాలని మెల్లగా పిచ్చుక దగ్గరకు చేరింది చేరి కపటం నటిస్తూ
"పిచ్చుక బావా పిచ్చుక బావా ! "నిన్ను కోపంలో కొట్టాను ఏమీ అనుకోకు అది సరేగాని ఇంతకు ఆ బంగారు ఉంగరాలు ఎక్కడివో చెప్పవా ?అని అడిగింది.
దాని కపట వేషం తెలియని అమాయకపు పిచ్చుక పాముపుట్టలో వేలు పెడితే దొరికాయి అని చెప్పింది
కాకికి దురాశ పుట్టింది పిచ్చుక కంటే ఎక్కువ బంగారం తెచ్చుకోవాలి అనుకొంది పిచ్చుకతో చెప్పా పెట్టకుండా గబగబ పాము పుట్టలో వేలు పెట్టింది దానిలో ఉన్న పాము అది గ్రహించి కోపంతో కరిచంది పాపం కాకి కెవ్వుమని అరిచి అక్కడి నుండి పారిపోయింది
పిచ్చుక మళ్ళీ తన పిడకల ఇంటికి వచ్చి కాకి జొన్న చేను ను తన సెనగ చేనును చూసుకుంటూ చాలా సుఖంగా ఉంది.

మృత్యుదేవత....

పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వూరుకున్నాడట సంహారం సంగతి ఆలోచించనే లేదు. జనాభా అంతకంతకూ పెరిగిపోయి భూమికి భారమైపోయారు ఆ క్షణం ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ బాధపడుతున్న బ్రహ్మ అవయవాలనుంచి ప్రళయాగ్ని పుట్టి ప్రజాసంహారం మొదలుపెట్టింది. భువనాలన్నీ అలా తగలబడిపోతుంటే చూడలేక పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి "అయ్యా నీ వల్ల పుట్టిన ఈ సృష్టిని కోపగించి నువ్వే నాశనం చేయటం తగునా అని ప్రార్ధించి దయతో యీ భూతాజాలన్ని కరుణించమని కోరెను" ఆ మాటలు విన్న విధాత తన కోపాన్ని దిగమింగే సమయంలో అతని ఇంద్రియాల నుంచి ఒక బయంకరమైన స్త్రీ ఉద్బవించింది
"నల్లని శరీరం , నిప్పుకణికల్లాంటి కళ్ళు, మెడలో పుర్రెలూ ,పొడవైన నల్లని జుత్తు, ఎర్రటి వస్త్రాలు, అతి భయంకరంగా వుంది" చకచక నడిచి వెళ్తోంది 'అమ్మాయీ !ఎక్కడికి పోతున్నావు ? ఇలారా అని పిలిచాడు బ్రహ్మ వచ్చి వినయంగా నిలబడింది
'నాలో పుట్టిన క్రోధం వల్ల జన్మించావు నువ్వు. అందుకని నా ఆజ్ఞ ప్రకారం నువ్వింక అన్ని ప్రాణుల్నీ సంహరిస్తూ వుండు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ' ఆ మాటలు విన్న ఆ స్త్రీ జలజలా కన్నీళ్ళు కార్చింది . కరుణామూర్తీ నువ్వు సృష్టించావు నన్ను ఈ దుర్మార్గపు పని ఎలా చెయ్యమంటావు? ప్రజల ఏడుపు నేను చూడలేను ఈ అధర్మానికి నన్ను పంపకు నేను ధేనుకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వమని వేడుకుంది.
అది విన్న బ్రహ్మ "పిచ్చిదానా ! నిన్ను ప్రజా సంహారం కోసమే సృష్టించాను అయినా ప్రజాసంహారం వల్ల నీకు అధర్మం ఎలా కలుగుతుంది? నా ఆజ్ఞ పాలించడం ధర్మం కాదా నీకు? నీకు అత్యుత్తమ కీర్తి లభించేటట్టు నేనూ పరమేశ్వరుడూ అనుగ్రహిస్తాం . నీవు మనస్సులో ఏ వికిరాలూ పెట్టుకొక సమయాన్ననుసరించి సంహారం చేయ్ అని ఆజ్ఞాపించెను.
" ప్రభూ! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను కానీ "ఎవరైతే నాలుగు రకాల భూతాలనూ జయిస్తారో ఎవరైతే ధర్మ మార్గన్ని అనుసరాస్తారో , న్యాయాన్ని కాపాడుతారో వారి జోలికి నేను వెళ్ళలేను" అని వేడుకున్నది . కనుక స్వామీ లోభం,క్రోధం, అసూయ అనేవి ప్రాణుల శరీరాల్ని వికృతం చేసేటట్టు చూడు అంది దుఃఖిస్తూ
అలాగే ఇప్పుడు నువు కార్చిన కన్నీటిబిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తూ మరణాలు సంభవింప చేస్తాయి అందుచేత నీకు ఏ అధర్మం అంటదు ప్రాణుల్ని చంపడమే నీకు పరమధర్మం నువ్వు తరతమ భేదాలు లేకుండా అందర్నీ ఆకర్షించు వెళ్ళు అని అన్నాడు బ్రహ్మ..
ధర్మహాని లేదనే నమ్మకం కుదిరాక ఆమె ఆ పనికి అంగీకరించింది అప్పటినుంచీ మనోవ్యధ, రోగాలూ ప్రాణుల శరీరాల్ని కృశింప చేస్తుంటే మృత్యువు ప్రాణం తీస్తూ వస్తోంది ...

మహాభక్తురాలు అక్కమహాదేవి


పశ్చిమకర్ణాటకదేశంలో 'కల్యాణరాజ్యం' ఉండేది. ఆ రాజ్యం లోని "ఉడుతడి" అనే సంస్దానాన్ని "కౌశికుడు" అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సంస్దాన రాణిగారు మహాబక్తురాలు ఒకరోజు ఉదయాన్నే "శివపూజ" చేసి భక్తి గీతాలు పాడుకుంటూ కూర్చున్నారు ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ కౌశికరాజు కూడా ఆమె చెంతకు వచ్చి కూర్చొని పరవశత్వంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు ఇంతలో రాణిగారి గురువుగారు ఆమె దర్శనార్దమై ద్వారం చెంతకు రావటం గమనించిన రాణిగారు భక్తితో పరుగెత్తుకుంటూ పోయి గురువు గారికి పాదాభివందనం చేశారు ఈ హడావుడిలో పైట కౌశికరాజు చేతిలో ఉండిపోయింది. ఇది గమనించిన గురువు గారు ఆమెకు ఆ విషయాన్ని తెలియచేసారు ఆమె సిగ్గుతో తలదించుకొని లేచి వెళ్లి కౌశికుని చేతిలో వున్న పైటను తీసుకొని ధరించింది.
ఆ చేష్టను చూచిన కౌశికునికి ఎక్కడలేని కొపం వచ్చింది తీక్షణంగా ఆమె వంక చూసి కఠినంగా మాట్లడి ఆమె మనస్సును నొప్పించాడు భర్త కఠినోక్తులు ఆమెను కదిలించాయి
"వలువలు గట్టిన వారు కులముల నీడు వడల నరయుదురా..? మరులు గొన్నవారు సిగ్గుల నరయుదురా చెన్నమల్లికార్జునుని వరించిన వారు లోకాభిమానము నెరగుదురా" అని పాడుకున్నది
ఆ మరుక్షణమే సంసారబంధాన్ని త్రెంచుకొని విరాగిణయై "చెన్నమల్లికార్జునుని" వెదుక్కుంటూ బయలు దేరింది కల్యాణనగరంలో బసవేశ్వరుని అనుభవమంటపంలో చాలాకాలం వేదాంతచర్చల్లో కాలం గడిపింది అనంతరం "శ్రీశైలం" చేరుకొని "కదళీవనం" అనే ప్రాంతంలో తపస్సు చేసి శివుని సన్నిది చేరుకున్నది
'ఆమెయే మహాభక్తురాలు అక్కమహాదేవి' , శ్రీశైలమల్లికార్జుని దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడు తప్పగ దర్శించే స్దలం
దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు రెండు గంటలు పడవలో నీటి మీద, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి చుట్టూ చెట్లూ చెప్పని నలవి గాని చూడచక్కని భక్కిరసపూరితమైన దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు
కన్నడభాషలో తెలుగులోనూ ఆమె వ్రాసిన "వచనాలు" వందలకొద్దీ వున్నాయి అవి అన్నీ శివుణ్ణి కీర్తిస్తూ వ్రాసినవే అయితే మన దురదృష్టం వాటిలో ఎక్కువ బాగం ప్రచురితం కాకపోవటమే ...

1400 సంవత్సరాల ముందు కధ

1400 సంవత్సరాల ముందు కధను చెప్పుకుంట్టున్నాము. మహమ్మదు ప్రవక్త మక్కాను జయించి మదీనాలో ఉన్నారు. మదీనా చారిత్రాత్మకమైనది.చాలా పవిత్రస్దలం కూడానూ అక్కడే బిలాల్ అనే ఒక నీగ్రో బానిస ఉండేవాడు అప్పట్లో నీగ్రోలను చాలా హీనంగా చూసేవారు కానీ మహమ్మద్ ప్రవక్త దృష్టిలో అందరూ సమానమే. అటువంటిది ఒక రోజు ప్రవక్త బిలాల్ ని పిలిచి నమాజుకు వేళయింది మిద్దె మీదికి వెళ్ళి అందరినీ పిలవమని చెప్పాడు ప్రవక్త ఆదేశాను సారం బిలాల్ వెంటనే మిద్దె మీదికి వెళ్ళి నమాజుకు పిలవడానికి నిలబడ్డాడు. నల్లని రంగు,మెద్దు పెదవులు ఉన్న అతణ్ణి చూసి గర్విష్టులైన కొందరు అరబ్బులు చీ చీ ఈ నల్ల నీగ్రో బానిస మనల్ని నమాజుకు పిలవటమూనూ మనం వెళ్ళటం చీ అని బిలాల్ మీద చీదరించుకున్నారు అంతే ఆ మరుక్షణం వీరికి సమాధానం చెప్తున్నారా అన్నట్లుగా ప్రవక్త ఇలా చెప్పారు మన గర్వం,పాపం, అజ్ణానం, తొలగించిన అల్లాకు జయమగుగాక ప్రజలారా ఇది గమనించండి ప్రజలంతా రెండు తెగలుగా విభజించబడ్డారు దేవుని నమ్మిన పుణ్యాత్ములు ఒకరు, పాపాత్ములు,కఠినాత్ములు ఇంకొకరు అయిననూ అందరునూ దేవుని సంతానమే అని సెలవిచ్చారు ప్రవక్త ఈ మాటలతో మహమ్మదు ప్రవక్త వారిలో గొప్ప మార్పును తెచ్చారు అంతే ఆ మరుక్షణం కొందరు అరబ్బులు తమ కుమార్తెలను ఆ నీగ్రో బానిస అయిన బిలాల్ కిచ్చి పెళ్ళి చేయటానికి ముందుకు వచ్చారు .... ఎంత మార్పు ఎంత
సమభావం ..
ఇస్లాం మతస్దుడు ఏ దేశపు వాడైనా మొత్తం ప్రపంచంలో వున్న ముస్లింలందరూ అతణ్ణి తమ సోదరుడిగా భావిస్తారు. ఒక రెడ్ ఇండియన్ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే , టర్కీ సుల్తాను అయినా సరే అతడితో కలసి ఆహారం తీసుకోవడానికి సందేహించడు అని తెలియచేసారు.

వివేకానందుడు


ముద్దులు మూటగట్టే చిన్నబాలుడు.
ఇంటిముందు ఆడుకుంటున్నాడు
తల్లి అతడికి స్నానం చేయించి క్రొత్త బట్టలు కట్టింది అతని పేరు నరేంద్రుడు, ఇంతలో ఒక బైరాగి భిక్షం అడుగుతూ ఆ బాలుడు ఉన్న ఇంటిముందు నిలిచాడు "నారాయణ నారాయణ" అని పాడుతూ భవతీ భిక్షాం దేహి అన్నాడు. ఆడుకొంటున్న బాలుడు బైరాగిని చూచి ఆనందంతో గంతులు వేశాడు తన దగ్గర ఉన్న పట్టురుమాలుని బైరాగికి ఇచ్చివేశాడు బైరాగి ఆ బాలుడిని దీవించి వెళ్ళిపోయాడు
ఇంతలో తల్లి వచ్చి ఆనందతాండవం లొ ఉన్న పిల్లవాన్ని చూచి రుమాలు గురించి అడిగింది ఆ బాలనరేంద్రుడు బెదరకుండా బైరాగికి ఇచ్చా నని చెప్పాడు
తల్లి కోపగించుకుంది
ఇట్లాగే యాచకులు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వటం అలవాటు అయింది మన నరేంద్రుడికి తల్లి ఆ బాధ పడలేక యాచకులు వచ్చే సమయానికి ఆ బాలుడిని గదిలో ఉంచి బయట గడియపెట్టేది అయినా ఆ బాలుడు కిటికీలో నుండి ఏదో ఒక వస్తువు యాచకులకు ఇస్తూవుండేవాడు.............................?
"నా దేశంలో ఒక్క కుక్క అయినా పస్తుపడి ఉంటే దానికి ఆహారమిచ్చి రక్షించమే నా పరమధర్మము ఇదే నా మతము" అని చాటి చెప్పిన మహనీయుడు, చిన్న తనంలోనే అంతటి దానగుణాన్ని ప్రదర్శించిన మహనుబావుడు అయిన నరేంద్రుడు మరి ఎవరో కాదు మహాభక్తుడు,రామకృష్ణ పరమహంసకు ముఖ్యశిష్యుడు , భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన గొప్ప దేశ భక్తుడు మన వివేకానందుడు అయిన వివేకానందస్వామి

ఏడు వారాల నగలు....




పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ,ప్రాముఖ్యత ఉండేది ఆ ఏడు వారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు.వీటి గురించి తెలుసుకోవాలని మా అమ్మ ని అడిగాను .
మన పూర్వీకులు మొదటగా గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య బంగారు నగలను ధరించెవారు అట,వారము రోజులు అంటే ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక బంగారు ఆభరణములను ధరించేవారు,
కంఠహారములు,గాజులు,కమ్మలు,ముక్కుపుడకలు,పాపిటబిల్ల,దండెకము(ఈనాటి వంకీ),ఉంగరాలు ఇలా చాలా ఆభరణాలు ఉండేవట.
ఆదివారము ..సూర్యుని కోసము కెంపుల కమ్మలు,హారాలు,గాజులు.
సోమవారము..చంద్రునికోసము ముత్యాలహారాలు,గాజులు.
మంగళవారము..కుజునికోసము పగడాల దండలు,ఉంగరాలు,గాజులు మొదలగునవి.
బుధవారము .. బుధునికోసము పచ్చల పతకాలు,కమ్మలు,గాజులు మొదలగునవి.
గురువారము.. బృహస్పతికోసము పుష్యరాగము,కమ్మలు,ఉంగరాలు మొదలగునవి.
శుక్రవారము.. శుక్రునికోసము వజ్రాల హారాలు,ముక్కుపుడక,వజ్రాల గాజులు మొదలగునవి.
శనివారము..శనికోసము నీలమణి మణిహారము,గాజులు మొదలగునవి.

నరకంలో శిక్షలు....2

11.సంధశన .....బ్రాహ్మణుల ధనము,ఇతరుల బంగారము,రత్నములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడుచుట మరియూ పటకారతో చర్మము పీకుట వంటి శిక్షలు వేయును.
12. తప్తసూర్మి......సంభోగించరాని పర స్ర్తీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన ఆడవారు ఈ శిక్షను అనుబవించును ఇందులో మండుతున్న ఇనుప చువ్వలతో శిక్షించును మరియూ మర్మాంగములను ఇనుప రంపముతో కోయును.
13.వజ్రకంటక శాల్మిలి..... పశువులతో సంభోగించిన వాడు ముళ్ళున్న బూరుగుచెట్టు మీదికి ఎక్కించి కిందకు లాగి వేయును..
14.వైతరణి... కులమర్యాద పాటించని పురుషులు, రాజు లేక రాజోద్యోగి చీము,నెత్తురు,తలవెంట్రుకలు,గోళ్ళచే నిండి ఉండు నదిలో త్రోయ బడును.
15.పూయదన... శౌచము,ఆచారము పాటించని బ్రాహ్మణులను మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేయుదురు.
16ప్రాణరోధ.... కుక్కలను,గాడిదలను,పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న వారిని ఆంపకోలలచే వేటాడుదురు.
17.వైశాన...... దంభ యజ్ఞములు చేసి పశువులను హింసించిన వారు ప్రాణాంతకమైన రకరకాల యాతనలను అనుభవించును.
18.లాలాభీక్ష..... కుల భార్యచే వీర్యపానము చేయించు వారిచే వీర్య పీనము చేయింతురు.
19.సారమేయోదనము.... ఇండ్లు తగుల పెట్టుట,విషము పెట్టుట అట్టి వారిని మరియూ దొంగ జీవితము అనుబవించు వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడువందల జాగిలములు పీక్కొని తినును.
20.అవిచి మంత... అబద్ద సాక్ష్యాలను చెప్పిన వారు,లావాదేవీల లో బొంకిన వారు వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడును.
21.అయఃపానము.. వ్రతనిష్టతో వుండి మద్యపానము చేసిన వారు, సోమపానము చేసిన వారు కరిగిన ఇనుమును త్రాగింతురు.
22.క్షారకర్దమ... తన కన్న అధికులను , పెద్దవారిని తిరస్కరించువారు తలక్రిందులగా పడద్రోసి నానా బాధలు పెట్టుదురు.
23.రక్షో గణబోధన... నరమేధములు చేయువారిని, పశువుల మాంసము తిను వారిని ముక్కలు ముక్కలుగా కొయును.
24.శూల ప్రోతము... జంతువులను, మూగజీవులను పొడిచి చంపినవారిని శూలములచే పొడువబడి,ఉరి కంబములను ఎక్కింపబడును.
25.దండసూకర... ఆడవారిని , పిల్లలకు భయము కలిగించు వారిని అయిదు తలలపాములు ఏడు తలల పాములచే క్రూరముగా హింసించెదరు.
26.అవధినిరోధన.... తల్లితండ్రులను, భార్యాపిల్లలను బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పేట్టి ఉక్కిరి బిక్కిరి చేయును.
27.పర్యావర్తన.... అతిధులను, అభ్యాగతులను గద్దించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు.
28.సూచిముఖి... ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వాని శరీరమును సూదులతో బొంతను వలే కుట్టుదురు.

కూడలి