
"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.
"ఊ"
"చాలా దూరం వెడుతుంది సుమా!"
"ఎంతదూరం వెళ్ళినా తేగలను".
"అలాగేం? సరే! చూడు మరి."
జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది.
ఆ వేళ వాళ్ళిద్దరికీ సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది.
అందుకే పొద్దున్నే బాణాలూ,విల్లూ తీసుకొని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు.
జమదగ్ని బాణాలు వేయటం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందొ కనుక్కుని తెచ్చి యివ్వడం-యిదీ ఆట వారిది.
ఆ ఆట యిద్దరికీ నచ్చింది. కానీ తీరా బాణం వేశాక జమదగ్నికి దిగులు కలిగేది.
"పాపం పిచ్చిది! పరుగెత్తుకుంటూ వెళ్ళింది. కనుక్కోగలదో లేదో?" అని మెడ సారించి ముందుకు చూసేవాడు.ఇంతలో రేణుక బాణం తీసుకువస్తూ కనపడేది.
ముని చూస్తుండగానే రేణుకాదేవి వచ్చింది.
"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది.
"సరే! ఈసారి తీసుకురా చూద్దాం! " అని ఇంకో బాణం వేశాడు.
ఆవిడ పరుగెత్తింది.
అలా జమదగ్ని వేస్తూనే ఉన్నాడు , ఆమె తెస్తూనే ఉంది .ఆ వినోదంలో కాలం ఎంత గడిచిపోయిందో కూడా తెలీలేదు వాళ్ళకి. ఈ సారి బాణం తెస్తానని వెళ్ళిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాలేదు.
జమదగ్ని చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి కొంతసేపటికి మెల్లిగా నడుస్తూ వచ్చింది రేణుకాదేవి.
"రేణుకా! ఏం ఈసారి యింత ఆలస్యం చేశావు"? అని ప్రశ్నించాడు జమదగ్ని.
"అలా చూడండి! నడిమింట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కాయి. తల నొప్పిగా ఉంది. ఆయాసం వచ్చేసరికి కాసేపు ఒక చెట్టు నీడన కూర్చుని వచ్చాను . అందుకని కొంచెం ఆలస్యం అయింది."
ఆమె ఆయాసపడుతూ ముఖం మీది చెమట చీరచెంగుతో తుడుచుకుంటూ చెప్పింది. చంద్రబింబం వంటి రేణుకాదేవి ముఖం ఎర్రబడి బాల భానుబింబమయింది.
జమదగ్ని హృదయం భార్య పట్ల ప్రేమతో కరిగి నీరయింది. " ఏమిటీ ? ఈ సూర్యుడు నిన్ను బాధపెట్టాడా ? ఇతగాడి పని చెబుతాను వుండు" అంటూ కోపంతో సూర్యుడివైపు అస్ర్తం సంధించాడు.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబ వచ్చి ఆయన చెయ్యి పట్టుకున్నాడు.
"జమదగ్ని మహామునీ! శాంతించు. సూర్యుడు లేకపోతే లోకాలు జీవిస్తాయా? నువ్వే ఆలోచించు ".
" అదంతా నాకు తెలీదు.సూర్యుడు నా భార్యని బాధపెట్టాడు. అందుకు అతను ఫలితం అనుభవించి తీరాలి. అడ్డులే" అని గర్జించాడు.
మరుక్షణమే "అయ్యా! నా తప్పు క్షమించు. నేనే సూర్యుడ్ని! నన్ను కరుణించు" అంటూ ఆ విప్రుడు జమదగ్నిని ప్రార్ధించాడు.
వెంటనే చెప్పులూ, గొడుగూ సృష్టించి , "ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి ఈ ఛత్రంతో శిరస్సుకు నీడపడితే నా వేడిమి సోకదు. వీటిని మా తల్లి రేణుకాదేవికి ఇవ్వండి" అని మహర్షికి సమర్పించుకున్నాడు.
జమదగ్ని సంతోషించాడు.
సూర్యుడు అంతర్ధానమయ్యాడు.
ఆ గొడుగునూ, చెప్పులనూ చూసి ప్రజలంతా వేడుకపడ్డారు. తాపసుల తామసం (కోపం) సైతం లోకకళ్యాణాన్ని సాధిస్తుందని సంతోషించి నాటినుంచి రకరకాలుగా తయారు చేసిన చెప్పులూ, గొడుగుల్ని వినియోగించడం ప్రారంభించారు.
సూర్యుడిచేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు,సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి పరమ పవిత్రాలు కనుకే వాటిని పితృకార్యాదులలో వినియోగిస్తారు...
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
-
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP
సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాల...
10 years ago


2 comments:
శ్రీ గారు ,ఇంతవరకూ వినలేదండీ !నిజంగానా ?
ఎప్పుడో చదివిన ఒక సంస్కృత పుత్తకంలో ఉంటె దానిని మీ ముందు వుంచ్చటం జరిగింది .
మీ అమూల్యమైన సలహాలను కోరుతూ....శ్రీ
Post a Comment