Loading...
.

పిట్ట లేని ఊరు రెక్కవిప్పదు.....

నెమలి కోన ఒక పల్లెటూరు. ఒకప్పుడది చెట్టుచేమలతో Free Image Hosting by FreeImageHosting.netపశుపక్ష్యాదులతో కళకళలాడుతూండేది . కానీ .. ఈ వేళ ఆ ఊళ్లో ఒక్క పిట్ట కూడా కనిపించదు. కోడి కూయదు, కిలకిలరావాలతో పొద్దు పొడవదు. అసలేం జరిగింది..?
ఆ ఊరిప్రక్క ఒక అడవి ఉంది అందులో రకరకాల పూలు పళ్లూ గల వృక్షాలు ఉండేవి. ఆ పళ్లూ,దుంపలూ తింటూ ప్రజలు సుఖంగా కాలం గడిపేవారు. ఒకసారి పట్నం నుంచి కొందరు వక్షివ్యాపారులు అక్కడికొచ్చారు.ఆ పరిసరాల్లో ఉన్న పక్షులు చాలా అరుదుగా దొరికే అందమైన పక్షులని పసిగట్టారు. ఆ పక్షుల్ని పట్టి తెచ్చిన వాళ్ళకి ఎక్కువ మొత్తం సొమ్ము ముట్టజెప్పారు.ఇలాంటి పక్షుల్ని ఎన్నితెచ్చినా కొంటామని చెప్పారు.
దీనితో అమాయకులైన ప్రజలు పక్షుల వెంటపడ్డారు. వలలుపన్నారు, గూళ్లు పడద్రోశారు, గుడ్లు తెచ్చి పొదగేశారు ఇలా పక్షివేట ఓ సంవత్సరంపాటు సాగింది.
ఓరోజు తెల్లవారింది ప్రకృతి మూగవోయింది. నెమలికోన చుట్టూ పదిక్రోసుల మేరకు పక్షిజాడ కనబడలేదు.పక్షులు లేక పోవడంతో పురుగుల బెడద పెరిగింది.చెట్ల ఆకులు,పూలు పళ్లూ పుచ్చి రాలిపోయాయి.అడవి ఎడారిగా మారిపోయింది.పిల్లాపాపా ఆకలితో నకనకలాడింది.ఊరు వొట్టిపోయింది.
ప్రజలు భయపడ్డారు, పశ్చాత్తాప పడ్డారు,పక్షులు మళ్లీ తిరిగి రావాలని ప్రార్ధనలు చేశారు, కానీ లాభం లేదు, ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ ఓ చోట చేరి ఏం చేద్దామా అని మంతనాలు జరుపుతున్నారు.
ఇంతలో ఓ చిన్నకుర్రాడు చిన్నారి పంజరం పట్టుకుని జనం మధ్యకొచ్చాడు.అందరూ అతడి వంకా ఆ పంజరం వంకా చూశారు.పంజరంలో ఒక పక్షి జంట.తాము డబ్బుకు ఆశపడి వేటాడి అమ్మిన మేలురకం పక్షుల జంట, ".....మా నాన్న చూడకుండా వీటిని తీసుకున్నాను. నాకు నేనే పెంచుతున్నాను...." అన్నాడు కుర్రాడు.
ప్రజల ముఖాల్లో ఆశారేఖలు ......"వీటిని పెంచండి . పక్షులు తిరిగొస్తాయ్..." అని ఓ ముసాలయన చెప్పాడు
తప్పెట్లు మోగాయి.ప్రజలు ఆనందంతో చిందులాడారు ఆ చిన్న పంజరాన్ని ఊరిమధ్య చెట్టుకు వ్రేలాడుదీశారు.ఆ పక్షి జంటను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.రోజుకోసారి ఊరంతా పంజరం చుట్టూ చేరి ప్రార్ధనలు చేసేవారు,పరవశించి పాటు పాడేవారు,ఆటలాడేవారు . పెంటిపక్షి ఒకేఒక గుడ్డు పెట్టింది, దాని మీదే పొదగడం మొదలుపట్టింది.
ఆ రోజు సాయంత్రం ఊరంతా పంజరం చుట్టూచేరింది. పొదుగుతోన్న పక్షివంకే కన్నార్పకుండా చూస్తోంది. టక.... టక...... శబ్దం.... గుల్ల పగిలింది... పక్షి పిల్ల రెక్క విప్పింది.....కువ కువ లాడింది... ఊరు మనసు విప్పారింది. ఆ ఆనందం నుంచి తేరుకునే లోపే ఆకాశంలో తెరలు తెరలుగా కదలిక.....
తలెత్తి చూశారు ఆశ్చర్యం.............పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి చెట్టుమీద వాలాయి, పంజరం చుట్టూ చేరాయి పంజరం తలుపు తెరుచుకుంది పక్షులన్నీ కలిసి ఆనందంగా ఎగిరిపోయాయి, ఊరు ఉత్సాహంతో ఉరకలేసంది,పరుగులు తీసారు , మైమరిచి నాట్యం చేసారు ....మళ్లీ అడవి చిగురించింది.పక్షుల కిలకిల రావాలతో,ఫలవృక్షాలతో కళకళలాడింది. ఆనాటినుంచి ఈనాటి దాకా ఆ ఊళ్లో కాకికి కూడా అపకారం జరగదు, పిచ్చుకకు కూడా అక్కడి ప్రజలు బ్రహ్మరధం పడతారు..
"పిట్టలేని ఊరు రెక్కవిప్పదు...
ప్రకృతిపై తెగబడితే బతుకుపండదు............."

0 comments:

Post a Comment

కూడలి